అప్పుడు ‘నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్’ అని ప్రజలను రెచ్చగొట్టి… ఇప్పుడు ఫీజు వసూలు చేయడమా?: హరీశ్ రావు

  • హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శ
  • అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి, మాట తప్పారని ఆగ్రహం
  • ఎల్ఆర్ఎస్‌ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలని డిమాండ్

ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఔట్‌లు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై హరీశ్ రావు స్పందించారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు.

నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్  అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్ఎస్‌కు ఫీజులు వసూలు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *